3, డిసెంబర్ 2008, బుధవారం

నా దేశమా...! (౩)

యుగ పురుషుడు మన (మాజీ) హోంమంత్రి శివరాజ్ పాటిల్ చెప్పే మాటలు మరీ విచిత్రం. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుండి తీవ్రవాదులు పారిపోతున్నారట! ఇవి ఆయన లాంటి వారు మాట్లాడవలసిన మాటలేనా? ఈ అసమర్ధతే ముష్కరులకు శ్రీరామ రక్షగా మారుతోంది. ఇలాంటి నేతలా మన వ్యవస్థకు కావాల్సింది? కాదు. పాటిల్ రాజీనామా చేసి కొత్త వారు వచ్చినా పరిస్థితులు మారుతాయనే నమ్మకం లేదు. ''పాత సారా కొత్త ...'' అన్నసామెత చందంగానే ఉంటుంది. ఎందుకంటే పాలనా పగ్గాలన్నీదైవ స్వరూపిణి అమ్మ (అధికారికంగానో, అనధికారకంగానో అనే సందేహాలు వద్దు) చేతిలో వున్నాయి. ఇది ముంబైపై జరిగిన దాడి కాదు. మన జాతి, సంస్కృతిపై జరిగిన దాడి. దీనికి భారత మాత తల్లడిల్లుతోంది. ఈ పాపం రాజకీయానిదే. ఉగ్రవాదుల పీచమనచాల్సిన రక్షణ వ్యవస్థ అలసత్వం ఉగ్రవాదులు జరిపే ఊచకోతకు ఊతమిస్తోంది. దేశంలో అశాంతికి కారణం ఇంటి దొంగలు. వీరిని ఈశ్వరుడు కూడా పట్టలేడన్నది అనాదిగా ఉన్న మాట. ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఏమిటి? పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఉన్నా అది మతతత్వ శక్తుల ఆధీనంలో ఉంది. ఆ పరిస్థితి మన దేశంలో లేదు. అమెరికన్లు, బ్రిటిషర్లు, ఇతర యురోపియన్లతో పాటుగా ఇండియన్లు కూడా ముస్లిం టెర్రరిస్టులకు టార్గెట్ అయ్యారు. ఇది పర్యాటక రంగంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. ఓ వైపు చైనా, మరోవైపు బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు మన దేశంలో అల్లకల్లోలాలకు కారణమవుతున్నాయి. ( శ్రీలంక దేశ రాజకీయాలే రాజీవ్ గాంధి మరణానికి కారణమని నా అభిప్రాయం). వీటి ఫలితమే వేల సంఖ్యలో ప్రజల బలిదానం. 2004 జనవరి నుండి 2008 సెప్టెంబర్ వరకు మనదేశంలో మరణించిన వారి సంఖ్య ఇరాక్ దేశ మృతులకు దగ్గరగా ఉందని ఓ సర్వే సంస్థ అభిప్రాయపడింది. ఆంధ్రదేశంలో పరిస్థితి మరీ దారుణం. ధర్నాలు చేస్తూ, దిష్టిబొమ్మల్ని తగలబెట్టించే మన నేతలకు ఇలాంటి విపత్కపరిస్థితులని ఎదుర్కొనే సామర్ధ్యం మచ్చుకైనా లేదు. నీలోఫర్ ఆసుపత్రిలో, ఆబిడ్స్ రోడ్ వెడల్పు పనుల్లో వీరంగం సృష్టించిన ఓ సామాజిక వర్గానికి చెందిన నేత ఒకరు కొంతమంది యువకుల్ని వెంటేసుకు వచ్చారు. మరి ఆయన ముంబై ముష్కరులపైకి తన రివాల్వర్ గురి పెట్టలేదేందుకో? కనీసం సంఘటన పట్ల స్పందించడానికి కూడా తీరిక లేదా లేక ధైర్యం లేదా? ఇక తొడగొట్టే, మీసాలు తిప్పే, గాలిలోకి ముద్దులు విసిరే నాయకుల్ని చూసి జనం నవ్వుతున్నారు. అలా అని మంచి నేతలు లేరని కాదు నా ఉద్దేశ్యం. అవినీతి వారి చేతుల్ని కట్టి పడేసింది. పరిస్థితి ఇప్పటికిప్పుడు, రాత్రికి రాత్రే అద్భుతం జరిగే చందంగా మారదు. దీనికి అందరూ కంకణబద్దులు కావాలి. దుర్ఘటన సంభవించినపుడు జరిగే దర్యాప్తు పారదర్శకంగా ఉండాలి. అన్ని మతాలకు చెందిన వారికి మన రాజ్యాంగంపై నమ్మకం, గౌరవం, భయం, భక్తి ఏర్పడాలి. మత ప్రాతిపదికన జరిగే విచారణ, దర్యాప్తులు వివిధ మతాలకు చెందిన వారిని తీవ్రవాదం వైపు ఆకర్షితుల్ని చేస్తున్నాయి. దేశంలోని సమస్యలను నిర్మూలించే చట్టాలను చేసే చట్ట సభలు కొట్టుకోవడానికి, ఒకరిని మరొకరు దుమ్మేత్తిపోయడానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. ఈ స్థితిని మార్చాలి. ఏదైనా మన చేతిలోనే ఉంది. చట్టాల్నిధైర్యంగా అమలు చేసే సత్తా ఉన్నరాజకీయాలకు స్వాగతం పలుకుదాం. -------------------------------------- జైహింద్ ----------------------------------------------

నా దేశమా...! (2)

మత చిచ్చు రగిల్చేదొకరు, దానిని పెంచి పోషించేదొకరు. జరగాల్సిందంతా జరిగినాక తీరిగ్గా కడుపులో చల్ల కదలకుండా ప్రకటనలు, పరామర్శలకు వచ్చేదొకరు. అంతేకానీ... దేశం రావణకాష్టంలా తగలబడిపోతున్నా దీనిని అంతమొందించే మార్గం వైపు ఆలోచించే తీరికా, gnanam వంటివి unnata స్థాయిలో వున్నvariqi lekapovdam mana దౌర్భాగ్యం. kerala CM achyutanandanవ్యవహారశైలి దీనికి నిదర్శనం. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుడి త్యాగాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలనే నీతిమాలిన రాజకీయం. ఉగ్రవాడులతూ పోరాడుతూ నేలకొరిగిన మరో కొదమ సింహం కర్కారే. మాలెగావ్ పేలుళ్ళ సంఘటనలో ఆయనని విమర్శించిన నోటితోనే రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు గుజరాత్ ముఖ్యమంత్రి వర్యులు మోడీ. అచ్యుతానందన్ స్థాయిలో కాకపోయినా... మోడీకి కూడా అవమానమే మిగిలింది. ప్రజలు మునపటిలా లేరు. రాజకీయ చైతన్యం పెరిగింది. దుర్ఘటన జరగ్గానే మందీ, మార్భలంతో వచ్చి ''ఇది నిఘా వైఫల్యం'', ''ప్రభుత్వం అసమర్ధత'' అని ప్రకటనలిచ్చే నేతల్ని చూసి జనం నవ్వుకునే స్థాయి నుండి ఎదురుతిరిగే స్థాయికి జనం చేరారు. ఇంటలిజెన్స్ వర్గాలు ముందే హెచ్చరించాయి. నౌకా మార్గం ద్వారా తీవ్రవాదులు చొరబడే అవకాసం వుందని. దున్నపోతుపై వర్షం చందాన అది మన నేతల చెవికెక్కలేదు. ఫలితం, షరా మామూలే. ''తీవ్రవాదాన్ని అంతమొందిస్తాం.'' ''కటినంగా వ్యవహరిస్తాం'' ఈ మాటలకు జనం మాట అటుంచి తీవ్రవాదులు కూడా నవ్వు కొంటున్నారు. ఎన్. ఎస్. జీ. కమెండోలు అద్వీతియంగా, పోరాడారనడంలో సందేహం లేదు. ఇది కాదంటే నేను క్షమార్హున్ని కాదు. కానీ... ప్రపంచ స్థాయిలో బలమైనదిగా పేరొందిన భారత సైనిక దళం సేవలను మనం సమర్ధవంతంగా ఎందుకు వినియోగించుకోలేకపోయాం. అంకెల్లోవున్న టెర్రరిస్టులను మట్టుబెట్టడానికి 'ఎన్. ఎస్. జీ. కమెండోలను' దాదాపు అరవై గంటలు పట్టిందంటే ఈ లోపం ఎవరిది? సంఘటనా స్థలానికి వారిని బస్సుల్లో, ట్రక్కుల్లో నింపాదిగా వారిని తీసుకువచ్చిన అధికార గణానిదా లేక సంఘటన జరిగిన (అంటే దాడి మొదలైన) పన్నెండు గంటలకు క్యాబినేట్ మీటింగు ఏర్పాటు చేసిన ప్రధాని (అధినేత్రి అమ్మగారంటే బాగుంటుందేమో) దా? అన్నింటికీ మించి మహాత్ముడు నడిచిన నేల పోరుబందర్ నుండే ఉగ్రవాదుల రాక్షస పోరు ఆలోచనే నన్ను ఖిన్నుడిని చేస్తోంది. ప్రభుత్వ తీరుతో పాటుగా ప్రతిపక్షాల వైఖరి కూడా సామాన్యుణ్ణి అభద్రతా భావంలో పడేస్తోంది. మాలెగావ్ పేలుళ్ళ సంఘటనలో అధికారుల స్వతంత్ర్యదర్యాప్తునకు (బీజేపి వంటి) వారు సహకరిస్తే కొంతలో కొంత నయంగా ఉండేది. తీవ్రవాదుల దాడి, వారిని కట్టడి చేసే నిర్ణయాలు, స్పందనలు కూడా ఓటు రాజకీయాల ఉచ్చులో చిక్కుకుపోవడం మరింత దారుణం. (sashesham )

నా దేశమా...!

INDIVIDUALLY, WE ARE ONE DROP, TOGETHER, WE ARE AN OCEAN. ఇటీవల ఓ పుస్తకం ముఖచిత్రంఫై నేను చదివిన వాక్యం ఇది. నీటి బిందువంత చిన్నదిగా వున్నా సముద్రమంత అర్ధాన్ని తనలో ఇముడ్చుకుని ఐకమత్యం ఆవశ్యకతను తెలుపుతోంది. క్రూర జంతువులుగా(మనం) పిలిచే పులి, సింహం వంటి జంతువులు ఆకలేసినపుడే వేటాడుతాయి. ఇరవయి ఆఫ్రికా ఏనుగుల్ని చంపగలిగినంత విషాన్ని కలిగిన సర్పం సైతం తనకు ప్రాణ హాని వుందన్న క్షణంలో మాత్రమే కాటు వేస్తుంది. మరి... నాగరికత తెలిసిన, మానసిక పరిపక్వత కలిగిన, సృష్టిలో ఏ జంతువు కూడా తనను మించిపోలేని స్థాయికి చేరిన 'మనిషి' ప్రవర్తన మాత్రం ఇలా ఎందుకుంది? ఓ కాకి చనిపోతే వంద కాకులు దాని చుట్టూ చేరతాయి. అంతదాకా ఎందుకు, ఓ హిందువు చనిపోతే మరో హిందువు, ఓ క్రిస్టియన్ చనిపోతే మరో క్రిస్టియన్, ఓ ముస్లిం చనిపోతే మరో ముస్లిం అండగా వస్తున్నాడు... కానీ... ఓ మనిషి చనిపోతే మరో మనిషి సాయం, సానుభూతి కరువైంది... మరీ పైశాచికంగా... అకారణంగా మనిషి మరో మనిషిని చంపే నీచ స్థాయికి దిగజారాడు... ఇంకా దిగజారుతున్నాడు. (దీనిని అభివృద్ది అందామా?) ఇటీవల అహ్మదాబాద్, మాలెగావ్ పేలుళ్లు, ముంబాయిలో ముష్కరుల దాడి, అంతకు ముందు బెంగుళూరు, హైదరాబాదులోని మక్కా, లుంబిని పార్క్, గోకుల్ చాట్ వంటి ప్రదేశాల్లో పేలుళ్లు సృష్టించిన నష్టానికి మూల్యం చెల్లించినది మాత్రం ఓ సామాన్యుడు. తనను రక్షిస్తారని ఆశించి ఎన్నుకొన్న ఒక్క రాజికీయ నాయకుడు కూడా ఇలాంటి సంఘటనలలో మరణించిన వారిలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. (???) ధరలు పెరిగాయని, వాడెవడో ఇంకెవడిదో దిష్టి బొమ్మ తగలపెట్టాడని, అభిమాన హీరో కటౌట్ చిరిగిందని, అంతదాకా ఎందుకు ప్రకృతి వైపరీత్యాలని కూడా రాజకీయం చేసే నేతలున్న ఈ సమాజంలో (దేశమందామా?) అంతర్జాతీయ సమస్య ఐన ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని కోరుకోవడం అత్యాశే కాదు, దురాశ కూడా. (సశేషం)