3, డిసెంబర్ 2008, బుధవారం

నా దేశమా...!

INDIVIDUALLY, WE ARE ONE DROP, TOGETHER, WE ARE AN OCEAN. ఇటీవల ఓ పుస్తకం ముఖచిత్రంఫై నేను చదివిన వాక్యం ఇది. నీటి బిందువంత చిన్నదిగా వున్నా సముద్రమంత అర్ధాన్ని తనలో ఇముడ్చుకుని ఐకమత్యం ఆవశ్యకతను తెలుపుతోంది. క్రూర జంతువులుగా(మనం) పిలిచే పులి, సింహం వంటి జంతువులు ఆకలేసినపుడే వేటాడుతాయి. ఇరవయి ఆఫ్రికా ఏనుగుల్ని చంపగలిగినంత విషాన్ని కలిగిన సర్పం సైతం తనకు ప్రాణ హాని వుందన్న క్షణంలో మాత్రమే కాటు వేస్తుంది. మరి... నాగరికత తెలిసిన, మానసిక పరిపక్వత కలిగిన, సృష్టిలో ఏ జంతువు కూడా తనను మించిపోలేని స్థాయికి చేరిన 'మనిషి' ప్రవర్తన మాత్రం ఇలా ఎందుకుంది? ఓ కాకి చనిపోతే వంద కాకులు దాని చుట్టూ చేరతాయి. అంతదాకా ఎందుకు, ఓ హిందువు చనిపోతే మరో హిందువు, ఓ క్రిస్టియన్ చనిపోతే మరో క్రిస్టియన్, ఓ ముస్లిం చనిపోతే మరో ముస్లిం అండగా వస్తున్నాడు... కానీ... ఓ మనిషి చనిపోతే మరో మనిషి సాయం, సానుభూతి కరువైంది... మరీ పైశాచికంగా... అకారణంగా మనిషి మరో మనిషిని చంపే నీచ స్థాయికి దిగజారాడు... ఇంకా దిగజారుతున్నాడు. (దీనిని అభివృద్ది అందామా?) ఇటీవల అహ్మదాబాద్, మాలెగావ్ పేలుళ్లు, ముంబాయిలో ముష్కరుల దాడి, అంతకు ముందు బెంగుళూరు, హైదరాబాదులోని మక్కా, లుంబిని పార్క్, గోకుల్ చాట్ వంటి ప్రదేశాల్లో పేలుళ్లు సృష్టించిన నష్టానికి మూల్యం చెల్లించినది మాత్రం ఓ సామాన్యుడు. తనను రక్షిస్తారని ఆశించి ఎన్నుకొన్న ఒక్క రాజికీయ నాయకుడు కూడా ఇలాంటి సంఘటనలలో మరణించిన వారిలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. (???) ధరలు పెరిగాయని, వాడెవడో ఇంకెవడిదో దిష్టి బొమ్మ తగలపెట్టాడని, అభిమాన హీరో కటౌట్ చిరిగిందని, అంతదాకా ఎందుకు ప్రకృతి వైపరీత్యాలని కూడా రాజకీయం చేసే నేతలున్న ఈ సమాజంలో (దేశమందామా?) అంతర్జాతీయ సమస్య ఐన ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని కోరుకోవడం అత్యాశే కాదు, దురాశ కూడా. (సశేషం)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

హైదరాబాదులోని మక్కా, లుంబిని పార్క్, గోకుల్ చాట్ వంటి ప్రదేశాల్లో పేలుళ్లు సృష్టించిన నష్టానికి మూల్యం చెల్లించినది మాత్రం ఓ సామాన్యుడు.
Bapu garu aksharala sathyam chepparu...