3, డిసెంబర్ 2008, బుధవారం

నా దేశమా...! (౩)

యుగ పురుషుడు మన (మాజీ) హోంమంత్రి శివరాజ్ పాటిల్ చెప్పే మాటలు మరీ విచిత్రం. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుండి తీవ్రవాదులు పారిపోతున్నారట! ఇవి ఆయన లాంటి వారు మాట్లాడవలసిన మాటలేనా? ఈ అసమర్ధతే ముష్కరులకు శ్రీరామ రక్షగా మారుతోంది. ఇలాంటి నేతలా మన వ్యవస్థకు కావాల్సింది? కాదు. పాటిల్ రాజీనామా చేసి కొత్త వారు వచ్చినా పరిస్థితులు మారుతాయనే నమ్మకం లేదు. ''పాత సారా కొత్త ...'' అన్నసామెత చందంగానే ఉంటుంది. ఎందుకంటే పాలనా పగ్గాలన్నీదైవ స్వరూపిణి అమ్మ (అధికారికంగానో, అనధికారకంగానో అనే సందేహాలు వద్దు) చేతిలో వున్నాయి. ఇది ముంబైపై జరిగిన దాడి కాదు. మన జాతి, సంస్కృతిపై జరిగిన దాడి. దీనికి భారత మాత తల్లడిల్లుతోంది. ఈ పాపం రాజకీయానిదే. ఉగ్రవాదుల పీచమనచాల్సిన రక్షణ వ్యవస్థ అలసత్వం ఉగ్రవాదులు జరిపే ఊచకోతకు ఊతమిస్తోంది. దేశంలో అశాంతికి కారణం ఇంటి దొంగలు. వీరిని ఈశ్వరుడు కూడా పట్టలేడన్నది అనాదిగా ఉన్న మాట. ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఏమిటి? పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఉన్నా అది మతతత్వ శక్తుల ఆధీనంలో ఉంది. ఆ పరిస్థితి మన దేశంలో లేదు. అమెరికన్లు, బ్రిటిషర్లు, ఇతర యురోపియన్లతో పాటుగా ఇండియన్లు కూడా ముస్లిం టెర్రరిస్టులకు టార్గెట్ అయ్యారు. ఇది పర్యాటక రంగంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. ఓ వైపు చైనా, మరోవైపు బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు మన దేశంలో అల్లకల్లోలాలకు కారణమవుతున్నాయి. ( శ్రీలంక దేశ రాజకీయాలే రాజీవ్ గాంధి మరణానికి కారణమని నా అభిప్రాయం). వీటి ఫలితమే వేల సంఖ్యలో ప్రజల బలిదానం. 2004 జనవరి నుండి 2008 సెప్టెంబర్ వరకు మనదేశంలో మరణించిన వారి సంఖ్య ఇరాక్ దేశ మృతులకు దగ్గరగా ఉందని ఓ సర్వే సంస్థ అభిప్రాయపడింది. ఆంధ్రదేశంలో పరిస్థితి మరీ దారుణం. ధర్నాలు చేస్తూ, దిష్టిబొమ్మల్ని తగలబెట్టించే మన నేతలకు ఇలాంటి విపత్కపరిస్థితులని ఎదుర్కొనే సామర్ధ్యం మచ్చుకైనా లేదు. నీలోఫర్ ఆసుపత్రిలో, ఆబిడ్స్ రోడ్ వెడల్పు పనుల్లో వీరంగం సృష్టించిన ఓ సామాజిక వర్గానికి చెందిన నేత ఒకరు కొంతమంది యువకుల్ని వెంటేసుకు వచ్చారు. మరి ఆయన ముంబై ముష్కరులపైకి తన రివాల్వర్ గురి పెట్టలేదేందుకో? కనీసం సంఘటన పట్ల స్పందించడానికి కూడా తీరిక లేదా లేక ధైర్యం లేదా? ఇక తొడగొట్టే, మీసాలు తిప్పే, గాలిలోకి ముద్దులు విసిరే నాయకుల్ని చూసి జనం నవ్వుతున్నారు. అలా అని మంచి నేతలు లేరని కాదు నా ఉద్దేశ్యం. అవినీతి వారి చేతుల్ని కట్టి పడేసింది. పరిస్థితి ఇప్పటికిప్పుడు, రాత్రికి రాత్రే అద్భుతం జరిగే చందంగా మారదు. దీనికి అందరూ కంకణబద్దులు కావాలి. దుర్ఘటన సంభవించినపుడు జరిగే దర్యాప్తు పారదర్శకంగా ఉండాలి. అన్ని మతాలకు చెందిన వారికి మన రాజ్యాంగంపై నమ్మకం, గౌరవం, భయం, భక్తి ఏర్పడాలి. మత ప్రాతిపదికన జరిగే విచారణ, దర్యాప్తులు వివిధ మతాలకు చెందిన వారిని తీవ్రవాదం వైపు ఆకర్షితుల్ని చేస్తున్నాయి. దేశంలోని సమస్యలను నిర్మూలించే చట్టాలను చేసే చట్ట సభలు కొట్టుకోవడానికి, ఒకరిని మరొకరు దుమ్మేత్తిపోయడానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. ఈ స్థితిని మార్చాలి. ఏదైనా మన చేతిలోనే ఉంది. చట్టాల్నిధైర్యంగా అమలు చేసే సత్తా ఉన్నరాజకీయాలకు స్వాగతం పలుకుదాం. -------------------------------------- జైహింద్ ----------------------------------------------

కామెంట్‌లు లేవు: